Chiranjeevi: బ్రిటన్ పార్లమెంట్‌లో చిరుకు ఘన సత్కారం.! 21 d ago

మెగాస్టార్ చిరంజీవి గారికి మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. 2025 మార్చి 19న యునైటెడ్ కింగడమ్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో ఆయనను ఘనంగా సత్కరించనున్నారు. సుమారు నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి.. కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకు ప్రతీకగా మెగాస్టార్ చిరుకు ఈ గౌరవం లభిస్తోంది. ఇది చిరుకు మాత్రమే కాదు.. భారత సినిమా ఇండస్ట్రీకి, ఆయన అభిమానులకు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం.
ఈ సత్కార వేడుక యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో జరుగనుంది. ఆయనతో పాటు..సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మ్యాన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి చేసిన సేవలను గుర్తించి.. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆయనకు "జీవిత సాఫల్య పురస్కారం" (Lifetime Achievement Award) అందించనుంది.
సినిమాల ద్వారా చేసిన అద్భుతమైన కృషిని గుర్తిస్తూ.. చిరంజీవి గారికి "పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్షిప్" లో ఎక్సలెన్స్ పురస్కారం ఇవ్వబడుతుంది. చిరంజీవి గారు సినిమాల్లో నటిస్తూనే ప్రజా సేవలో..సామాజిక బాధ్యతలో కూడా అద్భుతమైన పాత్ర పోషించారు. ఆయనకు ఈ గౌరవం నిజంగా అర్హతైనదే.. ఎందుకంటే ఆయన కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. ప్రజాసేవలో కూడా తన పాత్రను అద్భుతంగా పోషించారు.
సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు గుర్తించిన ప్రభుత్వం.. 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అవార్డులతో ఆయనను గౌరవించింది. చిరంజీవి గారు 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతోపాటు ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చిరంజీవి పేరు నమోదైంది.
ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీని తర్వాత చిరంజీవి.. అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో మరిన్ని చిత్రాలపై పనిచేస్తున్నారు.
చిరంజీవి గారు ఈ గౌరవాన్ని పొందడం మనందరికి గర్వకారణం. ఆయన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించడంతో పాటు..తన సేవా కార్యక్రమాలతో ప్రపంచానికి ఓ గొప్ప ఉదాహరణగా నిలిచారు.